Asianet News Telugu

కిలాడీ జంట... సింగిల్ యువకుల్ని టార్గెట్ చేసి.. దోచుకుంటూ..ఎలా చిక్కారంటే..

మహబూబ్ నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన పున్నం నవీన్ కుమార్ గత ఏడాది శిరీష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా తరచుగా హైదరాబాద్ కు వచ్చి హోటళ్ళలో బస చేసే వాళ్ళు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి సైబర్ నేరాలు చేయాలని పథకం వేశారు.  

police arrested  couple for allegedly extorting money in hyderabad - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 11:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఫేస్బుక్ ద్వారా అనేక మందిని పరిచయం చేసుకుని, పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చి ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న భార్యభర్తల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా.. చిత్రంగా నిందితురాలే మరో బాధితుడిని వెంటబెట్టుకుని వచ్చి రెండో కేసులు రిజిస్టర్ కు కారణమైంది. 

ఈ  కేసులో భర్తను అరెస్టు చేసిన అధికారులు, మూడు నెలల చిన్నారి ఉన్న నేపథ్యంలో భార్యకు సీఆర్సీ 41-ఏ నోటీసులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన పున్నం నవీన్ కుమార్ గత ఏడాది శిరీష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా తరచుగా హైదరాబాద్ కు వచ్చి హోటళ్ళలో బస చేసే వాళ్ళు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి సైబర్ నేరాలు చేయాలని పథకం వేశారు.  ఇందులో భాగంగా  శిరీష ఫేస్బుక్ లో స్వప్నరెడ్డి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసింది. దీని నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది.

ప్రధానంగా తన స్టేటస్ ను సింగిల్ అంటూ సూచించే అవివాహిత యువకుల్ని ఎంచుకుంది. వీటికి స్పందించి,  ఫ్రెండ్స్ గా మారిన వారితో శిరీష, ఆమె మాదిరిగా నవీన్ చాటింగ్ చేసే వాళ్ళు. ఫేస్బుక్ చాటింగ్ తర్వాత తమ నెంబర్లు ఇచ్చి, పుచ్చుకుని వాట్సప్ కు మారేవాళ్లు.  కొన్ని రోజుల తర్వాత ప్రేమ, పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చేవారు. కొన్ని సార్లు ఫోన్ చేస్తే శిరీష మాట్లాడుతూ వారికి నమ్మకం కలిగించేది. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలంటూ చెప్పి.. శిరీష
తన పరిచయస్తుల ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికేది. ఆపై రంగంలోకి దిగే నవీన్‌ రకరకాల పేర్లు చెప్పి డబ్బులు గుంజేవాడు.  

నగరానికి చెందిన ఓ యువకుడికి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం పేరుతో ఎనిమిది లక్షలు తీసుకొని మోసం చేశారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నవీన్ కుమార్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న శిరీష ఇటీవల రెండు లక్షలు ఇచ్చిన మరో వ్యక్తిని వెంటబెట్టుకుని ఠాణాకు వచ్చింది. అతడితో రాజీ పడుతున్నామని, భర్తను విడిచి పెట్టాలని కోరింది. అయితే ఆమెతో వచ్చిన ఈ బాధితుడికి జరిగిన విషయం  అర్థం కావడంతో.. వెంటనే ఆమె మీద కూడా ఫిర్యాదు చేయడంతో ఇంకో కేసు నమోదైంది.

ఇలా వచ్చిన డబ్బుతో భార్యాభర్తలు గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసినట్లు తేలింది. నవీన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు నెలల చిన్నారి ఉన్న శిరీష కు నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ పంథాలో వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని మోసం చేశారని ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆ కోణంలో ఆరా తీస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios