ప్రేయసి ప్రేమ కోసం... ఆమెతో కలిసి జీవించడం కోసం ఓ యువకుడు దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కి.. జైలు జీవితం గడపాల్సి వస్తోంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంతోష్‌నగర్‌లోని ఈదిబజార్‌కు చెందిన వసీమ్ బతుకుదెరువు కోసం  సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఏడాది క్రితం ఓ మహిళతో అయిన పరిచయం స్నేహంగా... ఆపై సన్నిహిత సంబంధంగా మారింది. తనకు వచ్చే ఆదాయంతో ప్రేయసితో కలిసి బతకడం, ఇతర ఖర్చులను తట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీం తో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం మొదలెట్టాడు.

గత ఏడాది ఫలక్‌ నుమ, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో రెండు నేరాలు చేశాడు. 2018 నవంబర్‌లో అరెస్టు అయిన ఇతగాడు ఆ తర్వాతి నెల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఇటీవల తన పాత పంథా కొనసాగిస్తూ చంద్రాయణగుట్ట, భవానీనగర్‌లోని రెండు ఇళ్లల్లో చోరీలు చేశాడు. సీసీకెమేరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు.

నేరాలు అంగీకరించిన వసీమ్‌ బంగారం అమ్మలేదని చెప్పాడు. మరికొన్ని నేరాలు చేసిన తర్వాత ఒకేసారి భారీ మొత్తం విక్రయించాలని భావించానన్నాడు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అతడి నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.