అతనికి మంచి గాత్రం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ.. అతను అనుకున్నంత గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. దీంతో.. ఓ ప్రముఖ సింగర్ పేరు చెప్పుకొని ఇక డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ప్రముఖ గాయని పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించాడు. తాను ఆమె బంధువునని.. మేనేజర్ అని, తోటి గాయకుడు అని  చెప్పుకొని మోసం చేయడం మొదలుపెట్టాడు. కాగా.. తాజాగా సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో  చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నగరానికి చెందిన అంకె చైతన్య అలియాస్ చైతూ(22) ఇంటర్ మధ్యలోనే ఆపేశాడు. పెద్ద సింగర్ కావాలనే కోరికతో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. కొన్ని పాటలు సొంతంగా రికార్డు చేసి మస్తీ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాడు. అయితే.. అతను ఊహించిన రీతిలో అవకాశాలురాలేదు.

దీంతో.. ఫాలోవర్స్ కోసం కొత్త పంథా ఎంచుకున్నాడు. సింగర్ పేరు చెప్పుకొని తన ఫాలోయింగ్ పెంచుకోవడం మొదలుపెట్టాడు. సదరు గాయని పేరు చెప్పుకొని ఓ కార్యక్రమం కూడా చేశాడు. నిజమేనని అనుకొని ఫ్యాన్స్ చాలా మంది ఆ కార్యక్రమానికి రావడం గమనార్హం. ఎట్టకేలకు ఈ విషయం సదరు గాయనికి తెలియడంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.