నమ్మకంగా పనిచేస్తూ యజమాని ఇంటికే కన్నం వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. యజమాని ఇంట్లోని బంగారం, వజ్రాభరణాలను చోరీ చేసింది. కాగా.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పంజాగుట్టలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బేగంపేట్‌ గ్రీన్‌ల్యాండ్స్‌ కుందన్‌బాగ్‌ అపార్టుమెంట్‌ -506 ఫ్లాట్లో కృష్ణసాగర్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో రెండేళ్లుగా బేగంపేట్‌ మాతాజీనగర్‌కు చెందిన కుమ్మరి శ్వేత (35) పనిచేస్తోంది.

ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలుసు. కృష్ణసాగర్‌ బెడ్‌రూంలోని అల్మారాలో బంగారం, వజ్రాభరణాలు దాచాడు. ఈ నెల 11న అల్మారాను తనిఖీ చేయగా ఒక జత బంగారం, వజ్రాల చెవి రింగులు, రెండు జతల బంగారు గాజులు కనిపించలేదు. ఇంట్లో పని చేస్తున్న శ్వేతపై అనుమానం వ్యక్తం చేశాడు. 

దీంతో అతడి సమీప బంధువు ప్రియరామ్‌ ఈ నెల 12న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్వేతను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం, వజ్రాభరణాలు చోరీ చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె నుంచి చోరీకి గురైన పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీఐ నాగయ్య తెలిపారు. డీఎస్ఐ విజయభాస్కర్‌ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.