జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించాడు. అందరూ చూస్తుండగా మూడు ముళ్లు వేసేశాడు. అలా పెళ్లి చేసుకున్నాడో లేదో.. అమ్మాయిని ఇక్కడే వదిలేసి.. అతను మాత్రం పారిపోయాడు. కాగా.. ఆ వరుడుని ఇండియా రప్పించి మరీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన ఓ యువతి వివాహం గతేడాది ఆగస్టు 6న ఆస్ట్రేలియాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న హైదరాబాదీ సురేష్ తో జరిగింది. పెళ్లి అయిన 15 రోజుల తర్వాత ఆస్ట్రేలియా బయలుదేరిన సురేష్.. మళ్లీ వచ్చి భార్యను తీసుకొని వెళతానని చెప్పాడు. అప్పటి నుంచి వధువు అత్తారింట్లోనే ఉంటుంది.

అయితే.. అత్తారింట్లో అత్త, ఆడపడుచు ఆమెను నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టారు. భర్తకు తన బాధ ఫోన్లో చెప్పినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తనని వచ్చి తీసుకువెళ్లు అని ప్రాధేయపడినా కనికరించలేదు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్ పనిచేస్తున్న సంస్థకు మొయిల్ పెట్టారు. ఆ తర్వాత అతనిని అక్కడి నుంచి ఇండియాకు రప్పించారు.

అలా హైదరాబాద్ లో అడుగుపెట్టాడో లేదో.. వెంటనే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.