అత్యాచారాలు, హత్యలు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం పలు చట్టాలను తీసుకువస్తోంది. న్యాయస్థానం కఠిన శిక్షలు వేస్తున్నాయి... అయినా నేరాలు చేయాలని అనుకునే పలువురి కిరాతకులను మాత్రం ఈ చట్టాలు భయపెట్టడం లేదు. ఎవరికీ తెలియకుండా ఒంటరి మహిళలపై అత్యాచారాలు చేసి... అనంతరం గుట్టు చప్పుడు కాకుండా హత్య చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇలాంటి పలు సంఘటనలు చోటుచేసుకోగా... తాజాగా మరో మానవ మృగం గురించి తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని  చెరువులో ఇటీవల ఓ మహిళ మృతదేహం కనిపించింది. కనీసం మహిళ ఎవరూ అన్నది కూడా గుర్తుపట్టరానివిధంగా చంపేసి నిప్పు పెట్టారు. ఇటీవల దిశ కేసు జరిగి ఉండటంతో... ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 

మర్డర్ మిస్టరీ చేధించేందుకు సీసీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులకు కేసు మిస్టరీ చేధించే క్లూ దొరికింది. పాత నేరస్తుడు అరుణ్ కుమారే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమ స్టైల్ లో ఎంక్వైరీ చేయటంతో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.

చెరువులో పడి ఉన్న మృతదేహం నిజామాబాద్ జిల్లాకు చెందిన స్రవంతిగా గుర్తించారు. సైకో కిల్లర్ అరుణ్ కుమార్.. గతంలో మూడు హత్యలు, రెండు చోరీలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌, తిరుమలగిరి, ఆర్మూర్‌లో అతనిపై మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. 

జైలులో ఉన్న సమయంలోనే మృతురాలు స్రవంతి భర్తతో పరిచయం పెంచుకున్నాడు అరుణ్. ఆ పరిచయంతో బాధితురాలితో స్నేహం కలిపాడు. డబ్బు ఆశ చూపి రామాయంపేటకు శివారుకు తీసుకువచ్చి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అరుణ్ కుమార్ కంటపడిన మహిళల్ని ఎవరినీ వదిలిపెట్టేవాడు కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది.