గతంలో అతను ఆమెను చాలా రకాలుగా వేధించాడు. భర్త లేక ఒంటరిగా జీవిస్తున్న ఆమెను తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో... తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తుందా అనే కోపంతో... ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన నగరంలోని హయత్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీలో ఉండే ఓ మహిళ భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె అదే కాలనీలో ఒంటిరిగా ఉంటూ ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తోంది.

కొంత కాలం క్రితం ఓ భూమి అమ్మకం విషయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉండే నారంబాబు అలియాస్‌ నారం బాబుగౌడ్‌(59) ఆమెకు పరిచయమయ్యాడు.  సహాయం చేస్తానంటూ పరిచయం పెంచుకోని ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. గత రెండు నెలలుగా అతడు ఆమెను వెంబడిస్తూ, ఇబ్బందులకు గురిచేయడంతో బాధితురాలు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అయితే.. అతడు యాంటిసిపేటరీ బెయిల్‌ తో బయటకు వచ్చాడు.

బయటకు వచ్చిన దగ్గర నుంచి మహిళను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. తనను జైలుకి పంపిందనే కోపంతో.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో  బుధవారం  ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా అతడు గొడ్డలితో, కల్లుగీసే కత్తితో దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నలో ఆమె మెడకు, తలకు, కుడిచేతికీ గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రిలో ఆమెతో మాట్లాడి, ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.