అతను ఓ ఆస్పత్రిలో వార్డు బాయ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే... ఎవరికీ అనుమానం రాకుండా చేసే పనులన్నీ చేస్తూనే ఉండేవారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల దగ్గర నుంచి.. అక్కడకు వచ్చే మహిళల దాకా అందరిపైనా కన్నేశాడు. వాళ్లకు అసభ్యకరంగా వీడియోలు పంపి వేధించేవాడు. చివరకు ఓ మహిళ ఫిర్యాదుతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పార్శ అఖిల్‌ అలియాస్‌ చందు, సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని హోమ్‌ కేర్‌ సెంటర్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు, ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లకు విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. ఆడవాళ్లను చూస్తే చాలు వెర్రెక్కిపోయేవాడు. ఓవైపు తన కామవాంఛలకు, మరోవైపు బెదిరింపులతో డబ్బులు వసూలు చేసేందుకు వారిని టార్గెట్‌ చేసేవాడు. ఆ విధంగా సుమారు 200మంది మహిళలు అతడి వికృత చర్యలకు గురైనట్లు తెలుస్తోంది. వారిలో 30మంది వివరాలు మాత్రమే పోలీసులకు లభ్యమయ్యాయి. 

కాగా.. ఓ మహిళ ఫిర్యాదుతోనే అతని గుట్టు రట్టయ్యింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. నల్లగొండలోని జామామసీద్‌ ప్రాంతంలో ఓ రోగికి సేవ చేసేందుకు ఏప్రిల్‌ 24వ తేదీన నల్లగొండకు వచ్చింది. ఆమె నెంబర్‌ సంపాదించిన అఖిల్‌, వీడియోకాల్‌ చేసి నగ్నంగా, అసభ్యంగా ప్రవర్తించాడు. దాన్నే ఫోన్లో రికార్డు చేయడంతో పాటు, స్ర్కీన్‌ షాట్‌ తీశాడు. తను చెప్పినట్లు వినకపోతే.. వాటిని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. అన్నట్లే.. పలు వెబ్‌సైట్లలో ఆమె ఫొటోలను పెట్టాడు. దీంతో సదరు యువతి పోలీసుల్ని ఆశ్రయించడంతో సైకో అఖిల్‌ ఆగడాలకు చెక్‌ పడింది. బాధిత యువతితో వలపన్ని అతడిని నల్లడొండ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.