ఆమెకు ఎప్పుడో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఓ చిన్న విషయంలో భర్తతో గొడవ అయ్యింది. దీంతో.. కోపంతో ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో.. ఆమె జీవితం మొత్తం మారిపోయింది. భర్త మీద కోపంతో.. తానే పనిచేసుకొని పిల్లలను పోషించుకోవాలని అనుకుంది. పని కోసం ఓ మహిళ చెప్పిన మాటలు నిజమని నమ్మి వెళ్లి.. ఓ వ్యక్తికి బంధీ కావాల్సి వచ్చింది. ఈ సంఘటన వేములవాడలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలిది సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఐదేళ్ల క్రితం పెళ్లయింది. మార్చిలో భర్తతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. ఆటోలో కామారెడ్డికి చేరుకొని, అక్కడి నుంచి రైలెక్కి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దిగింది. పిల్లలతో కలిసి రెండ్రోజులు అక్కడే ఉన్న ఆమెను ఓ వృద్ధురాలు చూసి.. మహారాష్ట్రలోని పర్భణీకి తీసుకెళ్లింది. అక్కడ మోరా అనే వ్యక్తికి రూ.లక్షకు ఆమెను విక్రయించింది.

ఆ వ్యక్తేమో రాజారామ్‌ అనే వ్యక్తికి, అతడేమో తన సమీప బంధువైన నాసిక్‌ సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన బాబు లక్ష్మణ్‌ జగపత్‌కు ఆమెను అప్పగించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న  లక్ష్మణ్‌ జగపత్‌...  మూడో భార్యగా ఉండాలంటూ బాధితురాలిని వేఽధించాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అడ్డుకొని, పారిపోయేందుకు యత్నిస్తే ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. 

ఆమెకు ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశాడు.  ఎట్టకేలకు ఫోన్‌ సంపాదించిన బాధితురాలు ఈ నెల 25న బంధువులకు సమాచారమిచ్చింది. ఆమె భర్త వేములవాడ పట్టణ సీఐకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించి మంగళవారం అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు, ఇద్దరు పిల్లలకు విముక్తి కల్పించి.. లక్ష్మణ్‌ జగపత్‌ను అరెస్టు చేశారు.