ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. నిజమేనని యువతి నమ్మేసింది. అతని ప్రేమను అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో వారికి తెలీకుండా రహస్యంగా తీసుకువెళ్లి.. మెడలో పసుపుతాడు కూడా కట్టాడు. తీరా.. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని.. పెళ్లి చెల్లదని.. తనకు ఏ సంబంధం లేదని చేతులు ఎత్తేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చంపేట పరిధి నాగార్జున కాలనీకి చెందిన శ్రీపురం పవన్(30) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. కర్మాన్ ఘాట్ ప్రాంతానికి చెందిన యువతి(28) ని ప్రేమిస్తున్నాననంటూ నమ్మించాడు. 2015 నుంచే ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కాగా.. 2017 లో ఆమెను బెంగళూరు తీసుకువెళ్లి మెడలో పసుపుతాడు కట్టాడు.

అక్కడి నుంచి ఇద్దరూ ఊటీ వెళ్లారు. అనంతరం తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటూ పవన్ ఆ యువతికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ యువకుడిలో మార్పు తీసుకువచ్చేందుకు యువతి చాలా ప్రయత్నాలు చేసినా అతను మారలేదు. దీంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ని అరెస్టు  చేశారు.