ఫేస్ బుక్ లో స్నేహం పేరిట పరిచయం పెంచుకుంటారు. మహిళలు, పురుషులు, యువత ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేసుకొని వారితో స్నేహం చేసి.. దొరికినంత దోచుకుంటున్న అంతర్జాతీయ ముఠా సభ్యుల్ని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నెరేడ్ మెట్ లోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.

ఘనా దేశానికి చెందిన అక్ పలు గాడ్స్ టైం(26), లిబిరీనియన్ దేశానికి చెందిన అడ్ జెల్ గిఫ్ట్ ఒసాన్(27), క్రోమా ఒయిబా(24), నైజీరియాకు చెందిన ఎన్ కెకికాన్ఫిడెన్స్ డేవిడ్(27), ఇహిగియేటర్ ఒసాస్(27) స్నేహితులు. ప్రధాన నిందితుడు ఆక్ పాలు గాడ్స్ టైం 2019 మార్చిలో టూరిస్ట్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. అనంతరం తన వీసాను వ్యాపార వీసాగా మార్చుకున్నాడు. మిగితా నలుగురు స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని తన నేరాలకు శ్రీకారం చుట్టాడు.

ప్లాన్ ప్రకారం నకిలీ సిమ్ కార్డులు తీసుకువచ్చి..  దానితో ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయిలకు ఫోన్ చేసి వల వేస్తుంటారు. వారిని నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. అమ్మాయిలకు అబ్బాయిల పేర్లతో రిక్వెస్ట్ లుపెట్టడం.. అబ్బాయిలకు అమ్మాయిల పేరుతో రిక్వెస్టులు పెట్టడం లాంటివి చేస్తుండేవారు.

ముందుగా వాళ్లని వలలో వేసుకోవడానికి గిఫ్ట్స్ పంపిస్తారు. ఆ తర్వాత వాళ్లు తమ ట్రాప్ లో పడ్డారని తెలియగానే తెలివిగా వారి దగ్గర నుంచి డబ్బులు గుంజడం మొదలుపెడతారు. కాగా.. ఇటీవల నగరానికి చెందిన ఓ యువకుడు ఈ ముఠా చేతిలోపడి మోసపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించగా.. అసలు విషయం మొత్తం బయటపడింది.