హన్మకొండలో పుట్టిన రోజునాడే ఓ యువతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.... ఈ కేసును పోలీసులు చేధించారు. యువతిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువతికి పరిచయం ఉన్న వ్యక్తే... హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌ కి చెందిన యువతి.. తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.  బుధవారం పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని చెప్పి, యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.

ఇది కూడా చదవండి..పుట్టిన రోజని గుడికి వెళితే... యువతిపై సామూహిక అత్యాచారం, హత్య...
 
చాలా సేపటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందింది.

కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసి  తట్టుకోలేక పోయారు. పుట్టిన రోజునాడే ఇలా చనిపోవడం వాళ్లు తట్టుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. 

కాగా... యువతి ఇంటి నుంచి గుడికి వెళ్లిన సమయంలో... ఆమె స్నేహితుడు సాయి కుమార్ ఫోన్ చేశాడు. సాయి కుమార్ హంటర్ రోడ్డులో ఉన్న ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరికీ ఆరు నెలల క్రితమే పరిచయం ఏర్పడింది. కాగా... నిన్న ఆమె పుట్టిన రోజు కావడంతో సాయి కుమార్ ఫోన్ చేసి కాజీపేట రావాలని కోరాడు.

దీంతో.. యువతి కాజీపేట వెళ్లి అతనిని కలిసింది. కారులో వచ్చిన సాయి కుమార్ ఆమెను చినపెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ విషయాన్ని వెంటనే తన ఇద్దరు స్నేహితులకు తెలియజేశాడు.

వారిద్దరి సహాయంతో శవాన్ని కారులో పెట్టుకొని పలు ప్రాంతాల్లో చీకటి పడేవరకు తిప్పాడు. ఆ తర్వాత యువతికి కొత్త బట్టలు కొని.. అవి ఆమె మృతదేహానికి వేశారు. ఆ తర్వాత రాత్రి చీకటిపడిన తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్లి విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో పడేశాడు. కాగా...గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఈ కేసులో నిందితుడు సాయి కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు.