హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజుగా మారింది. గుడికి వెళ్లిన యువతిపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అనంతరం హత్య చేశారు. గుడికి వెళ్లిన యువతి శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌ కి చెందిన యువతి.. తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.  బుధవారం పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని చెప్పి, యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.
 
చాలా సేపటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందింది.

కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసి  తట్టుకోలేక పోయారు. పుట్టిన రోజునాడే ఇలా చనిపోవడం వాళ్లు తట్టుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. 

 యువతి శవం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శరీరంపై పెద్దగా గాయాలు లేవు.కాగా మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. 

ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఎక్కువ. వీధి దీపాలు లేక పోవడంతో చీకటిగా ఉంటుంది. యువతిని కిడ్నాప్‌ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశారా? ఇది ఆమెకు తెలిసిన వారి పనేనా? గుట్టు బయటపడకుండా ఉండేందుకు హత్య చేసి ఉంటారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.