ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ దీక్ష నేపథ్యంలో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు(మార్చి 24, 25 తేదీల్లో) నిరుద్యోగ మహాదీక్ష, నిరుద్యోగ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. నిరుద్యోగులు సమస్యలపై దీక్ష తలపెట్టిన జేఏసీ నాయకులు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరుద్యోగ మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు క్యాంపస్ లోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదని ఓయూ వీసీ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే నిన్నటి నుంచే విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజ్‌తో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. హాస్టల్స్‌లో ఉన్న పలువురు జేఏసీ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్థి జేఏసీ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగ మహాదీక్ష నిర్వహించి తీరుతామని చెబుతుంది.
మరోవైపు ఓయూలో నిరుద్యోగ మహాదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తారనే కారణంతో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవితో పాటు పలువురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థి జేఏసీ నాయకులకు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా నిరుద్యోగ మహాదీక్షను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగ దీక్షలో పాల్గొనేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్‌వీ నాయకులు కూడా క్యాంపస్‌లో పోటీగా నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు కూడా యత్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌వీ నాయకులను అదుపులోకి తీసుకన్న పోలీసులు.. సమీపంలోని పోలీసు స్టేషన్‌లకు తరలించారు. ఓ వైపు కాంగ్రెస్ వర్గం, మరోవైపు కాంగ్రెస్ వ్యతిరేక వర్గం నిరసనలతో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
అయితే తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. పోలీసులను పంపి తనను గృహనిర్భందం చేయడం కాదని.. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలని సవాలు విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లు సచ్ఛీలురైతే, స్కాంలో వారి పాత్రలేకపోతే తన సవాల్ ను స్వీకరించాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
