Asianet News TeluguAsianet News Telugu

ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో నవీన్ రెడ్డి, కాసేపట్లో న్యాయమూర్తి ముందుకు

ఆదిభట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇతనితో కలిపి మొత్తం 32 మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.  

police arrest naveen reddy in adibatla kidnap case
Author
First Published Dec 10, 2022, 5:29 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కలిపి మొత్తం 32 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 

మరోవైపు కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డాక్టర్ వైశాలి రెడ్డి ఇంటి సమీపంలోని పలు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. యువతి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఇంట్లో వున్న ఫర్నిచర్, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారు. దాడికి ముందు జరిగిన పలు విషయాలను పోలీసులు రాబడుతున్నారు. 

యువతిని అపహరించాలని ముందే ప్లాన్ చేసిన నవీన్ రెడ్డి.. తన మిత్రులు, తన వద్ద పనిచేసే సిబ్బందిని కార్యాలయానికి రప్పించాడు. అక్కడ మద్యం పార్టీ ఏర్పాటు చేసి.. పీకలదాకా తాగించాడు. అనంతరం వారందరినీ వెంటబెట్టుకుని కార్లలో వైశాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె ఇంటిపై దాడి చేయించి.. యువతిని ఎత్తుకునిపోయాడు. ఘటన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు లైవ్ ట్రాకింగ్ ద్వారా వారిని ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. వీరిపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశామన్నారు. 

Also REad:ఆఫీస్‌లో పార్టీ , మద్యం తాగించి వైశాలి ఇంటికి, నవీన్ రెడ్డి పక్కా స్కెచ్.. వెలుగులోకి కీలక విషయాలు

కాగా... కిడ్నాప్ ఘటనకు సంబంధించి నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతి ఇంటికి వెళ్లి తన కొడుకు చేసింది తప్పేనని చెప్పిన నారాయణమ్మ.. అంతకుముందు జరిగిన విషయాలను కూడా చూడాలని కోరారు. వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపారు. యవతితో పెళ్లి అయిందని తన కొడుకు చెప్పాడని.. అయితే పెళ్లి జరిగిందో, లేదో తనకు తెలియదని చెప్పారు. యువతి తల్లిదండ్రులు తొలుత నవీన్ తో పెళ్లి చేస్తామని చెప్పారని, ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తన కొడుకుని పైసల కోసం యువతి కుటుంబం వాడుకుందని ఆరోపించారు. నవీన్ రెడ్డికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పారు. అయితే వారిద్దరికి పెళ్లి అయిందనే తన బంధువులు కూడా భావించేవారని చెప్పారు. 

తన కొడుకు ఎప్పుడూ ఫోన్ చేసి బయట ఉన్నానని  చెప్పేవాడని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఆమెను కాలేజ్‌కు తీసుకెళ్లేవాడని  చెప్పారు. ఆ యువతి  కూడా నవీన్ రెడ్డిని ప్రేమించిందని.. తమ ఇంటికి కూడా వచ్చిందని చెప్పారు. యువతి ఇప్పుడు ఎందుకిలా మారిపోయిందో తెలియదని తెలిపారు. అయితే ఆమె మనస్ఫూర్తిగా కోడలిగా వస్తే అంగీకరిస్తానని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios