Asianet News TeluguAsianet News Telugu

ఆవేశానికి సంకెళ్లు పడుతున్నాయి

తెలంగాణలో ఆవేశానికి సంకెళ్లు పడుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసులు జూలు విదిల్చి తడాఖా చూపుతున్నారు.  నేరాలు చేయకపోయినా ఊసలు లెక్కబెట్టిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలేవీ చేయకపోయినా జైలు పాలు చేస్తున్నారు.  ఆవేశానికి సంకెళ్లేస్తున్న పోలీసుల తీరుపై జనాలు మండిపడుతున్నారు.

 

police arrest kukunurupally villagers for expressing solidarity with SI Prabhakar Reddy

చట్టం తన పని తాను చేసుకుపోతుందని నిరూపిస్తున్నారు సిద్ధిపేట పోలీసులు. కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన క్వార్టర్ లో చనిపోయిన తర్వాత స్థానికులు ఆవేశానికి లోనయ్యారు. అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్ టివి లైవ్ వ్యాన్ ను కాలబెట్టారు. పోలీసు ఉన్నతాధికారులపై ఘాటైన విమర్శలు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల వత్తిళ్ల వల్లే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడన్న కోపంతో స్థానికులు అక్కడ రాజీవ్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

 

స్థానికులు ఆవేశంగా చేసిన పనిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ సంఘటనలో పాల్గొన్న  43 మందదిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్నదానిని బట్టి అక్కడి స్థానికులు కొందరు అక్రమ సంఘంగా ఏర్పాటైనారట. రాజీవ్ రహదారిపై వచ్చపోయే వాహనాలను అడ్డుకున్నారట. సెక్షన్ 30 అమలులో ఉందని తెలిసినప్పటికీ అక్రమ సంఘంగా ఏర్పడ్డారట. పోలీసు విధులకు ఆటంకం కలిగించారట. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. ఈ నేపథ్యంలో 43 మంది మీద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపులు చేపట్టారు.

 

ఇక వీరితోపాటు మరో ఆరుగురు వ్యక్తుల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వారిలో కొందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రయివేటు ఆస్తుల ధ్వంసం, మీడియా వారిపై రాళ్ల దాడి, మీడియా వాహనాల కాల్చడం వంటి చర్యలకు పాల్పడ్డ వారిని గుర్తించి ఈ కేసులు నమోదు చేశారు.

 

మరో విషయమేమంటే ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుంటూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపిస్తూ కొన్ని కేసులు నమోదు చేశారు. ఈ కేసుల కింద 53 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

 

మొత్తానికి ఫ్రెండ్లీ పోలీసులు బాగానే కేసులు పెట్టారు కానీ కుకునూరుపల్లి ఎస్సై భార్య చేసిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారో పోలీసులు వెల్లడించలేదు. ఉన్నతాధికారులు మామూళ్ల కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు తనకు తన భర్త పదే పదే చెప్పేవాడని, కొందరి పేర్లు కూడా వెల్లడించారు ఎస్సై ప్రభాకర్ రెడ్డి భార్య. కానీ ఆ విషయంలో విచారణ ఏమైందో, ఎంతమందిని నిందితులుగా గుర్తించారో, ఏమేమి కేసులు పెట్టారో ఇప్పటివరకు చెప్పలేదు. మరి స్థానికులు ఆవేశంతో చేసినదానికి మాత్రం కేసలు పెట్టి జైలుపాలు చేస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios