Asianet News TeluguAsianet News Telugu

ఇంజనీరింగ్ విద్యార్థినుల ఫొటోల మార్పింగ్ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. 

Police arrest four for morphs pics of engineering students in Hyderabad Ghatkesar
Author
First Published Jan 7, 2023, 4:46 PM IST

హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అయితే ఈ నేరానికి పాల్పడింది ఒక్కడు కాదని.. నలుగురని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అమ్మాయిలకు పూర్తి భద్రతను కల్పిస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి లక్ష్మీ గణేష్ తొలుత అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపడం స్టార్ట్ చేశాడని.. ఆ తర్వాత మిగిలిన వారు కూడా ప్రారంభించారని చెప్పారు. లక్ష్మీ గణేష్ వెయిటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. నిందితుల ఫోన్ల నుంచి డేటాను విశ్లేషించాల్సి ఉందన్నారు. ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉందన్నారు. 

అసలేం జరిగిందంటే.. ఆ కాలేజ్‌లో ఓ విద్యార్థికి నవంబర్‌లో గుర్తుతెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఇద్దరూ రెండు, మూడు సార్లు మాట్లాడుకున్నారు. కొన్ని మెసేజ్‌లు కూడా పంపుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి అతనికి మెసేజ్‌లు పంపడం మానేసింది. అతని కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. నిందితడు అనేక నెంబర్ల నుంచి విద్యార్థికి కాల్ చేయగా.. ఆమె వాటిని పట్టించుకోలేదు. అయితే ఆ వ్యక్తి కాలేజ్‌లోని అనేక ఇతర అమ్మాయిల నెంబర్లను సంపాదించాడు. వారికి నగ్న చిత్రాలను డిమాండ్ చేస్తూ మెజేజ్‌లు పంపడం ప్రారంభించాడు. 

అయితే నిందితుడు అమ్మాయిల వాట్సాప్ డిస్‌ప్లే చిత్రాలను ఉపయోగించి, వాటిని అసభ్యకరమైనవిగా మార్ఫింగ్ చేసి వారికే పంపేవాడు. విద్యార్థినులు తమ నగ్న ఫోటోలు పంపకుంటే లేదా నగ్న వీడియో కాల్స్ చేయకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాటిని షేర్ చేస్తానని బెదిరించేవాడు. ఇందుకు సంబంధించి  చాలా మంది విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు కాలేజ్ ముందు ఆందోళనకు దిగాయి. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదు చేసుకన్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.  ఈ విషయమై  తాము పట్టించుకోవడం లేదనే ఆరోపణలను కాలేజీ యాజమాన్యం తోసిపుచ్చింది.  తమ దృష్టికి విద్యార్ధినులు  విషయం తీసుకు రాగానే  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కాలేజీ యాజమాన్యం  ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios