Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్‌ అల్లర్ల ఘటనలో 52 మంది అరెస్ట్‌.. పారిపోయిన వారి కోసం గాలింపు

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసులు 52 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

police arrest 52 people over agnipath protest in secunderabad railway station
Author
Hyderabad, First Published Jun 18, 2022, 5:08 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) అల్లర్లకు సంబంధించి కుట్ర కోణంపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి ఆందోళనల కారణంగా రైల్వే శాఖకు రూ.12 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. మొత్తం 200 మందికి పైగా అభ్యర్ధులు విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్, నార్త్ జోన్, రైల్వే పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

అంతకుముందు అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్లు ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ (secunderabad railway division manager) అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైళ్ల రద్దుతో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. 

5 రైల్ ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని గుప్తా వివరించారు. అయితే డీజిల్ ట్యాంకర్‌కు (పవర్ కారు) భారీ ప్రమాదం తప్పిందని.. పవర్‌కార్‌కు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. పార్సిల్ కార్యాయలం పూర్తిగా దగ్దమైంది. పూర్తి స్థాయి నష్టం అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు.ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్‌ను పునరుద్ధరించామని ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా తెలిపారు.

ALso REad:అలా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగేది.. సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే డీఎం

ఇకపోతే.. సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు నిన్న ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు. 

రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios