సంచలనం సృష్టించిన కమెడియన్ విజయ్ ఆత్మహత్య కేసులో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటి వరకు అన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు ఇక రంగంలోకి దిగి అరెస్టుల పర్వం కొనసాగించనున్నారు. ఈరోజు లేదా రేపటికి కీలకమైన నిందితులను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య ఘటనపై విజయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో వనితారెడ్డి, అడ్వకెట్ పేర్లను పొందుపరిచారు.

విజయ్ ఆత్మహత్య కేసులో కీలక నిందితులుగా విజయ్ భార్య వనితారెడ్డి అలియాస్ వరలక్ష్మి ఉన్నట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అలాగే ఆమెతోపాటు మరో కీలక నిందితుడిగా అడ్వకెట్ ను కూడా అరెస్టు చేసే అవకాశముందని చెబుతున్నారు. అడ్వకెట్, వనితారెడ్డి ఇద్దరూ కలిసి బెదిరించడం, వేధింపులకు గురిచేయడం కారణంగానే విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు విజయ్ తండ్రి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. సాంకేతికంగా అన్ని ఆధారాలను సేకరించారు.

తన భర్త చావుకు తానేమీ కారణం కాదని.. విజయ్ తండ్రి మీద అనుమానాలున్నాయంటూ వనితారెడ్డి కొత్త వాదన తెరపైకి తెచ్చారు. విజయ్ అంత్యక్రియలకు కూడా వనితారెడ్డి హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికీ భర్త అయినందున అంత్యక్రియలకు ఎందుకు రాలేదన్నది తేలాల్సి ఉంది. ఆమె తప్పు లేకుంటే ధైర్యంగా అంత్యక్రియల్లో పాల్గొనేదే కదా? ఆమెలో ఎక్కడో ఒకమూల ఆందోళన, తప్పు చేశానన్న భయం వెంటాడుతుండడంతోనే ఆమె విజయ్ అంత్యక్రియలకు రాలేదని విజయ్ మిత్రులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఆత్మహత్య ఘటనలో తన పాత్ర ఏమాత్రం లేదంటూ ఒక సెల్ఫీ వీడియోను వనితారెడ్డి పోలీసులకు పంపించారు. అందులో అనే అంశాలను లేవనెత్తారు. పాపతో నవ్వుతూ గడిపిన వ్యక్తి అంతలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడంలేదన్నారు. తండ్రికి, విజయ్ కి మధ్య గొడవులున్నాయని ఆ ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడేమోనని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అయితే గతంలో విజయ్ కి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, ఆ విషయాన్ని తాను కళ్లారా చూశానని వనితారెడ్డి ఆరోపణలు చేశారు. కానీ తాజాగా స్థలం విషయంలో విజయ్ కి ఆయన తండ్రికి మధ్య గొడవల విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తన తప్పు ఏమీ లేదంటూనే కొత్త కొత్త అంశాలను వెల్లడిస్తున్నారు వనితారెడ్డి.

వనితారెడ్డి తిరిగే కారు నవయుగ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఉండడంతో ఆ కంపెనీ డైరెక్టర్ శశిధర్ తో వనితారెడ్డికి మధ్య ఎలాంటి స్నేహం ఉందన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు అదే కారు మీద వెనక భాగంలో బార్ అసోసియేషన్ తాలూకు అడ్వకెట్ స్టిక్కర్ కూడా అంటించి ఉండడంతో పోలీసులకు ఆధారాలు అందినట్లైంది. అయితే ఆత్మహత్య ఘటన తర్వాత ఆ కారు వెనుక భాగంలో ఉన్న అడ్వకెట్ స్టిక్కర్ ను తొలగించారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ అన్ని అంశాలపై ఆధారాలను సేకరించారు పోలీసులు. దీంతో విజయ్ సతీమణి వనితారెడ్డి, అడ్వకెట్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. మరి ఈ ఘటనలో నవయుగ కంపెనీ డైరెక్టర్ శశిధర్ పాత్రపై పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడంలేదు.