హైదరాబాద్: ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న తెలంగాణ శాసన మండలిలోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గవర్నర్ కోటాలో ఆయనను శాసన మండలికి ఎంపిక చేయించే ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వాటిలో ఒక సీటును ఎస్సీ కోటాలో గోరటి వెంకన్నకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు .

గోరటి వెంకన్న ఇటీవల కేసీఆర్ ను కలిసినట్లు కూడా తెలుస్తోంది. కేసీఆర్ ను గోరటి వెంకన్న వ్యతిరేకించిన సందర్భాలు కూడా లేవు. ప్రగతి భవన్ లో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లో కూడా గోరటి వెంకన్న పాల్గొన్నారు. దాంతో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. 

గోరటి వెంకన్నను శాసన మండలికి పంపే విషయంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. గవర్నర్ కోటాలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్ాయి. వాటిలో ఒకటి మార్చి 2వ తేదీన, మరోటి జూన్ 19వ తేదీన, మరోటి ఆగస్టు 17వ తేదీన ఖాళీ అయ్యాయి. 

కర్నె ప్రభాకర్ ను తిరిగి శాసనసభకు నామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాయిని నర్సింహా రెడ్డిని కూడా తిరిగి మండలికి పంపించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడో స్థానం కోసం కొద్ది రోజులుగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మూడో సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ స్థితిలో గోరటి వెంకన్నకు మూడో సీటు కేటాయించడం ద్వారా కేసీఆర్ ఆ సమస్యను దాటవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం