అధికారుల ఉద్యోగాలు ఊడిపోతాయి, జాగ్రత్త : పోచారం

First Published 29, May 2018, 6:19 PM IST
Pocharam Srinivas Reddy warns officers
Highlights

సీరియస్ వార్నింగ్

తెలంగాణలో భూరికార్డుల ప్రక్షాళనలో పారదర్శకత వహించాలన్నారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించినా, రైతులకు అన్యాయం జరిగినా అధికారులు ఉద్యోగాలను కొల్పొతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట, మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామాలలో జరిగిన భూరికార్డుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడారు.

గతంలో పరాయి పాలనలో తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగలేదు. నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంది, గత కాలపు తప్పులను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడు రైతులకు న్యాయం జరగకపోతే ఎప్పటికి జరగదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో ముఖాముఖి మాట్లాడి భూముల సమస్యలను పరిష్కరించాలి. కోర్టు కేసులు, వివాదాలలో ఉన్న భూములను పక్కన పెట్టాలి. ముఖ్యంగా వారసత్వ భూముల (పౌతి పట్టా) విషయంలో ఆలస్యం చేయకూడదు. వివాదరహిత భూములను కూడా వెంటనే నమోదు చేసి రైతులకు పాస్ పుస్తకాలను జారి చేయాలి.

సాగు కోసం రైతుల అప్పు చేయకుండా, దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమే పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను రైతుబంధు పథకం ద్వారా అందిస్తుంది. రైతుబంధు పథకం సమర్ధవంతంగా అమలుకు పాస్ పుస్తకాలే ప్రామాణికం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్నారు.  100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. అయితే కొంతమంది కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో కొన్ని గ్రామాలలో భూముల నమోదులో తప్పులు దొర్లాయి. ఇప్పటికైనా అధికారులు తప్పులను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలను అమలు చేయల్సిన బాధ్యత అధికారులదే, సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడదు.

రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరో గొప్ప పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు రూ. 5 లక్షల భీమా రక్షణను కల్పించనున్నారు. ప్రతీ రైతుకు ఏడాదికి రూ. 2,271 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే పది రోజులలోనే ఆ రైతు కుటుంబానికి అయిదు లక్షల రూపాయల ప్రీమియం అందుతుంది. త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రైతు వివరాలను, నామిని పేరును ధరఖాస్తులో నమోదు చేస్తారు. ఈ పథకానికి కూడా రెవిన్యూ రికార్డులే ఆధారం. జాగ్రత్తగా పనిచేయాలి.

ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ యన్. సత్యనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

loader