తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన  సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెలుగుచూసినప్పటీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రజలకు, మద్దతురాలుకు అందుబాటులో లేకుండాపోయారు.

తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెలుగుచూసినప్పటీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రజలకు, మద్దతురాలుకు అందుబాటులో లేకుండాపోయారు. అయితే తాజాగా వారు నియోజకవర్గాలకు చేరుకున్నారు. మూడు వారాల విరామం తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు భారీ భద్రత నడుమ బుల్లెట్ ఫ్రూప్ వాహనాల్లో వారి వారి నియోజకవర్గాలకు తిరిగి వచ్చారు. 

అక్టోబర్ 28న మొయినాబాద్ ఫామ్‌ హౌస్ ఘటన వెలుగులోకి వచ్చిన సంతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగా కాంతారావు(పినపాక) లను కొంతమంది బీజేపీ ఏజెంట్లు సంప్రదించి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసి పార్టీలో చేర్చుకోవాలని చూశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే నలుగురు ఎమ్మెల్యేలు.. ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్‌, మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార సభ, టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో తప్ప వారు బహిరంగంగా కనిపించలేదు. చండూరులో టీఆర్ఎస్ సభలో ఢిల్లీ బ్రోకర్ల నుంచి కోట్లాది రూపాయలను తిప్పికొట్టినందుకు ఈ నలుగురు ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య రక్షకులు అని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాగే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ కూడా విడుదల చేశారు. ఆ మీడియా సమావేశంలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రశంసించారు. ఆ తర్వాత నవంబర్ 15న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నలుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బహిరంగంగా కనిపించారు. ఆ 

అయితే వారు 20 రోజులకు పైగా ప్రగతి భవన్‌లోనే ఉండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వినిపించాయి. ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఆయా నియోజకవర్గాల్లోని కొందరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ రావడంతోనే వారిని సురక్షిత ప్రదేశంలో ఉంచినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 4+4 భద్రతా సిబ్బందిని అందజేసింది. 

ఇక, మూడు వారాల విరామం తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు భారీ భద్రత నడుమ వారి వారి నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి.. వారి వారి నియోజకవర్గాల్లో అడుగుపెట్టగా.. బీరం హర్షవర్దన్ రెడ్డి నేడు హైదరాబాద్‌ నుంచి కొల్లపూర్ చేరుకోనున్నారు. అక్టోబర్ 28 నుండి వారి ఆచూకీ గురించి గోప్యత పాటించడంతో.. ఆందోళన చెందిన వారి నియోజకవర్గాలలోని మద్దతుదారులు.. వారు తిరిగి నియోజకవర్గంలో అడుగుపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.