హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 

కేసీార్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారిందని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని హరీష్ రావు అన్నారు. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నదని అన్నారు. 

కేసీఆర్ కారణజన్ములని ఆయన అన్నారు. కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని ఆయన అన్నారు.  తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నదని అన్నారు. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని హరీష్ రావు అన్నారు.

కాగా, కేసీఆర్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కల్వకుంట్ల కవిత పెద్దమ్మ తల్లికి బంగారు చీర సమర్పించునున్నారు.