శ్రీరామానుజాచార్యులు విశిష్టద్వైతం ప్రవచించారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని మోడీ పేర్కొన్నారు. మూఢ విశ్వాసాలను తొలగించేందుకు ఆనాడే రామానుజాచార్యులు కృషి చేశారని మోడీ కొనియాడారు.
అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజే రామానుజచార్య విగ్రహావిష్కరణ (ramanuja sahasrabdi samaroham) జరిగిందని అన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని శ్రీరామానగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని.. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని మోడీ గుర్తుచేశారు. దేశ సంస్కృతిని ఈ సమతామూర్తి మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 108 దివ్యదేశ మందిరాలను ఇక్కడే చూశానని.. శ్రీరామానుజాచార్యులు విశిష్టద్వైతం ప్రవచించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని మోడీ పేర్కొన్నారు.
ప్రగతిశీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజార్యులను చూస్తే తెలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. మూఢ విశ్వాసాలను తొలగించేందుకు ఆనాడే రామానుజాచార్యులు కృషి చేశారని మోడీ కొనియాడారు. ఆనాడే దళితులను కలుపుకుని ముందుకు సాగారని... ఆలయాల్లో దళితులకు దర్శనభాగ్యం కలిగించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్య బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (dr br ambedkar) కూడా రామానుజాచార్య ప్రవచనాలనే చెప్పారని మోడీ గుర్తుచేశారు.
సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని.. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. సబ్ కా సాథ్.... సబ్ కా వికాస్ నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉజ్వల్ పథకం, జన్‌ధన్, స్వచ్ఛ్‌భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని ప్రధాని పేర్కొన్నారు. గురుమంత్రాన్ని రామానుజాచార్య అందరికీ అందించారని .. దేశ ఐక్యతకు ఆయన స్పూర్తి అని, దేశమంతటా పర్యటించారని మోడీ తెలిపారు.
అందుకే దళిత అణగారిన వర్గాల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదని ప్రధాని అన్నారు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోందని.. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారని మోడీ వెల్లడించారు. పోచంపల్లికి ప్రపంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కిందని ప్రధాని చెప్పారు. అలాగే రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందని నరేంద్ర మోడీ అన్నారు.
