రేపు తెలంగాణకు ప్రధాని .. పర్యటనకు గంటల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చురకలు వేసిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండూ వంశ పారంపర్య పార్టీలేనని , వీటికి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను. అసమర్థ బీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు . BRS, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలు.’’ అంటూ మోడీ ఎద్దేవా చేశారు.
‘‘ మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను రూ. 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ’’ అని ప్రధాని ఆకాంక్షించారు.
మరోవైపు రేపటి ప్రధాని మోడీ పర్యటనకు మరోసారి సీఎం కేసీఆర్ దూరంగా వుండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోనందునే కేబినెట్ సమావేశం కూడా వాయిదాపడిన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ :
- ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోడీ చేరుకుంటారు. 1.35కి ఎయిర్‌పోర్ట్ నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహబూబ్‌నగర్‌కు పయనం. మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు.
- 2.15 నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమరభేరి పేరిట బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
- అనంతరం హెలికాఫ్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.