Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు.. ఎవరిని వదలేది లేదు : మోడీ హెచ్చరికలు

బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు వున్నాయని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వారి నుంచి తిరిగి రాబడతామని మోడీ హెచ్చరించారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

pm narendra modi sensational comments on brs leaders over delhi liquor policy scam ksp
Author
First Published Nov 7, 2023, 6:47 PM IST

ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 9 ఏళ్లుగా తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం వుందని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ ఎద్దేవా చేశారు.

అబ్ధుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది బీజేపీయేనని.. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా వున్నారని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభకు తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీయేనని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో 3 అంశాలు కామన్‌గా వున్నాయని.. బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు సీ టీమ్.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్ అని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షణాలని ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీ వర్గానికి చెందిన తనను ప్రధానిగా చేశారని నరేంద్ర మోడీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని ఆయన గుర్తుచేశారు. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీయేనని ప్రధాని తెలిపారు. బీసీ యువత కోసం బీఆర్ఎస్ ఏం చేయలేదని .. బీసీలకు రూ. లక్ష ఇస్తామని బీఆర్ఎస్ వాగ్ధానం చేసిందని మోడీ చురకలంటించారు.

రూ. లక్ష ఇస్తామన్న వాగ్ధానాన్ని బీఆర్ఎస్ నెరవేర్చలేదని.. తాము మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ప్రధాని తెలిపారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని .. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి వున్న రెండు ముఖాలని.. తెలంగాణ యువతను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని మోడీ దుయ్యబట్టారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజ్.. యువత జీవితాలను దుర్బరం చేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోడీ పేర్కొన్నారు. పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం అందిస్తామని, పేదలకు ఉచిత రేషన్ .. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని.. తెలంగాణలో మార్పు తుఫాను కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయని మోడీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు వున్నాయని.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వారి నుంచి తిరిగి రాబడతామని మోడీ హెచ్చరించారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలా .. వద్దా అని ప్రధాని ప్రశ్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారని మోడీ దుయ్యబట్టారు.  

Follow Us:
Download App:
  • android
  • ios