ప్రధాని నరేంద్ర మోడీ ఇక్రిశాట్‌కు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొని.. ప్రత్యేక లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం పంటల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అలాగే శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. 

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఇక్రిశాట్‌కు (icrisat) చేరుకున్నారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై , సీఎస్ సోమేశ్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇక్రిశాట్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొని.. ప్రత్యేక లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం పంటల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అలాగే శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. తర్వాత ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని.. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్​ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.

అయితే ప్రధాని మోదీ పర్యటకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఆయన జ్వరం, స్వల్ప అస్వస్థతతో బాధపడంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీకి స్వాగతం, వీడ్కోలు పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. 

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇది

ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రత్యేక విమానంలో Shamshabad international airportకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. అక్కడ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్‌ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు. 

సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్‌ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. అనంతరం 8.20 గంటలకు ముచ్చింతల్‌ ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.