హైదరాబాద్: హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని భారత ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోదీ హైదరాబాద్ అంటే ఎంత ఇష్టమో సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎంతో ఆదర్శమన్నారు. ఎందరో అమరవీరులు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ పటేల్ వల్లే హైదరాబాద్ కు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.  

ఆనాడు పటేల్ లేకపోతే ఈనాడు తెలంగాణ ఉండేది కాదని మోదీ చెప్పారు. అందుకే తనకు హైదరాబాద్ వస్తే సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను మోదీ ప్రజలకు పరిచయం చేశారు.  

ఎల్బీ స్టేడియంలో సభకు హాజరైన ప్రజలను చూస్తుంటే బీజేపీ గెలుపు ఖాయమైపోయిందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వంశ, కుటుంబ, మత పరమైన రాజకీయాలు శాసిస్తున్నాయని ఆరోపించారు. ఈ వంశ, కుటుంబ రాజులను ఓడించి తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. 

కుటుంబ, వంశ, మతపరమైన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి రాజకీయాల వల్లే కొత్త రాజులు పుట్టుకువస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు బీజేపీ ఎన్నికలు అని అర్థమవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చెయ్యాలా వద్దా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. నిజమైన లౌకిక వాదులైతే  వంశపారం పర్య రాజకీయాలను వ్యతిరేకిస్తారన్నారు. 

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం దివంగత సీఎం ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని మోదీ గుర్తు చేశారు. అయితే ఆయన నినాదాన్ని అవమానించేలా నేడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ ఒడిలో టీడీపీ చేరిపోయిందని మండిపడ్డారు.  

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం దేశ రాజకీయాలను శాసిస్తుందా లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అవునా కాదా అంటూ  ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కూ0డా ఒకే కుటుంబానికి చెందిన పార్టీ అవునా కాదా అంటూ నిలదీశారు. 

ఎంఐఎం మతాంతర పార్టీ అవునా కాదా అంటూ ప్రశ్నించారు. ఈ వంశ, కుటుంబ, మతపరమైన పాలనకు తెలంగాణ ఎన్నికలతోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అంటూ మోదీ వ్యాఖ్యానించారు. లౌకికవాదంలో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అంటూ కొనియాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్,టీడీపీ,ఎంఐఎం పార్టీలు  ప్రజాస్వామ్మానికి చేటు కాదా అంటూ ప్రశ్నించారు. 

తెలంగాణ కోసం యువకులు ఎందుకు బలిదానం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం యువకుల బలిదానాలకు అనుగుణంగా పనిచెయ్యడం లేదన్నారు. తెలంగాణను టూటీ చేసే హక్కు ప్రజలు తమకు కట్టబెట్టినట్లు టీఆర్ఎస్ కుటుంబం పనిచేస్తుందని మండిపడ్డారు. 

తెలంగాణ సంపదను లూటీ చేసే హక్కు ఒకే కుటుంబానికి కట్టబెట్టలేదన్నారు. ప్రజాస్వామ్య ప్రేమికులు ఈ విషయాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్షలాంటివన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీ బీజేపీ బీటీమ్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కి టీఆర్ఎస్ బీ టీమ్ కాదని తాము ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉన్నామని ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 

గతంలో కర్ణాటక ఎన్నికల్లో కూడా జేడీఎస్ బీజేపీకి బీ టీమ్ అని పదేపదే ఆరోపించారని అయితే  ఎన్నికల ఫలితాల తర్వాత జేడీఎస్ ఎవరితో కలసిందో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్, జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.  

అలాగే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. అయితే ఈ పార్టీలకు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియవని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆలోచన విధానం ఒక్కటేనని మోదీ అన్నారు. ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటికి కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటూ ఆరోపించారు. 

కేసీఆర్ కి గురువు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబుకు గురువు మేడమ్ సోనియా గాంధీ అంటూ ఆరోపించారు. యూపీఏ వన్ ప్రభుత్వంలో ఎవరు కేంద్రమంత్రిగా పనిచేశారో ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్ సోనియాగాంధీ దగ్గర శిక్షణ తీసుకున్నారంటూ మండిపడ్డారు. 

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మెుదలైంది కాంగ్రెస్ పార్టీతోనేనని విమర్శించారు. బీజేపీని అడ్డుకోవాలన్నది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఒప్పందం అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఈ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ అంటూ చెప్పారు.