PM Narendra Modi : తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై నరేంద్ర మోడీ స్పందన.. ఏమన్నారంటే?
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తెలంగాణ లో బీజీపీ అభ్యర్థుల గెలుపునూ అభినందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023 (Telangana Election Results 2023) ఈరోజు వెలువడుతోంది. అన్ని కేంద్రాల్లో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. కొన్ని స్థానాల్లో మరికొద్ది సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే మెజార్టీ దక్కించుకున్న పార్టీల అభ్యర్థులే గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఫలితాలపై కొద్ది సేపటి కింద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు.
ఇప్పటికే తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో బీజీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికన తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు తన అభినందనలు తెలియజేశారు. ‘నా ప్రియమైన తెలంగాణా సోదరులారా, మీ మద్దతు బీజేపీకి ఉన్నందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మద్దతు పెరుగుతూ వస్తోంది. రాబోయే కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక తెలంగాణలో గోషామహాల్, కామారెడ్డి, సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక కామారెడ్డిలో మాత్రం సీఎం కేసీఆర్, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి పై వెంకట రమణ రెడ్డి (KVR) గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బీజీపీ మొన్నటి వరకు వచ్చిన ఎగ్జిట్ ఫోల్స్ కంటే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని చూసింది. ఈ క్రమంలో నరేంద్ర మోడీ కూడా బీజేపీ కార్యకర్తలను అభినందించారు.