PM Modi: ప్రధాని మోడీ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులను, శంకుస్థాపనలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
PM Modi: ప్రధాని మోడీ నేడు (మంగళవారం)నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని దాదాపు రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులను, శంకుస్థాపనలను చేయనున్నారు. కాగా.. పాలమూరు బహిరంగ సభలో ప్రధాని మోడీపసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీపై కీలక ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో నేడు జరుగనున్న ప్రధానిమోడీ సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ సభకు భారీ ఎత్తున రైతులను, మహిళలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా భారీ ఎత్తున సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు యోచిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో మహిళలతో పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోడీ ప్రకటన చేయడం పట్ల ప్రధాని మోడీకి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రధాని మోడీ కూడా తెలుగులో బదులివ్వడం గమనార్హం. తమకు రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అందులో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:
నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ దాదాపు రూ.8,000కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే..రూ. 1360 కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోడీ ప్రారంభిస్తారు. రూ. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య నిర్మించి రైలు మార్గాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు. సిద్దిపేట- సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.
షెడ్యూల్ ఇలా:
>> ప్రధాని మోడీ మధ్యాహ్నాం 2:10 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నాం 2:55 గంటల ప్రాంతంలో నిజామబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి సభ స్థలికి చేరుకుంటారు.
>> 3:00 నుంచి 3:35 గంటల వరకు వర్చువల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
>> 3:45 నుంచి 4:45 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
>> సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ కు తిరుగు ప్రయాణమవుతారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా, అక్టోబర్ మొదటివారంలోని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు.
