ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలపై దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు జాతీయ పార్టీలు సైతం తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించారు. 

పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలతోపాటు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఓటు హక్కు వినియోగంపై పలు సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్వీట్ చేశారు.  ఇవాళ ఎన్నికల రోజు. 

తెలంగాణలో ఉన్న నా సోదరీ సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నానని ట్వీట్ చేశారు. అలాగే ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు.  

ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ పలు విడతలుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటేసి వంశపారంపర్య పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. తాజాగా ట్విట్టర్ ద్వారా మరో పిలుపునిచ్చారు.