ఈ నెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే ప్రారంభం కానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ.. ఈ నెల 19న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. దీంతో వందేభారత్ రైలు ఎప్పటి నుంచి ప్రారంభం కానుందనే చర్చ ప్రారంభం అయింది. అయితే దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకానున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 15న ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిష్టాత్మక వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఇది ఎనిమిదో వందే భారత్ రైలు. ఇది సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య సుమారు ఎనిమిది గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైలుకు ఇంటర్మీడియట్ స్టాప్‌లలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేష్టన్లు ఉన్నాయి.