తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ఆ రోజే ఎన్నికల శంఖరావం.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు..
ప్రధాని మోడీ (PM modi) అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి, పలు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అదే తరుణంలో ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

Modi Tour in Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, అసమ్మతి నేతలను బుజ్జగిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలో పర్వం కొనసాగుతోంది. వరుస సమావేశాలతో జోరు మీద ఉంది. అయితే.. కమలం పార్టీలో ఆ ఊపు తెచ్చేందుకు స్వయంగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగనున్నారు. బీజేపీ నేతలను ఎన్నికలకు సంసిద్దం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటన ఖరారవడం, ఆయన ప్రయాణ ప్రణాళిక వెల్లడి కావడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు తెలుస్తోంది.
బేగంపేట విమానాశ్రయం రాకుండా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:35 శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అలా మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. ఈ సభలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యవహార శైలిపై ధ్వజమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సభావేదిక నుంచే తెలంగాణ బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని పూరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని హెలికాప్టర్ లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
మరోవైపు.. ప్రధాని మోడీ సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో ఈ సభలో మహిళలను ఎక్కువ మొత్తంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి, ఆయా నియోజకవర్గ నేతలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్‌లో జరిగే సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
మరోవైపు.. మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలలో చాలా మార్పులు జరగబోతాయని కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో జరిగే సభతో తెలంగాణ రాజకీయాల్లో ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారనీ, అలాగే.. పాలమూరులో అక్టోబరు 1న జరిగే సభ కీలక పాత్ర పోషిస్తుందని, ఆ రోజు నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రధాని పర్యటన తర్వాత.. బీజేపీ అధిష్టానం ప్రత్యేక కార్యచరణతో ముందుకు రానున్నది. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఇతర కేంద్ర మంత్రులు , నాయకులు రాష్ట్రవ్యాప్తంగా జరిగే సభల్లో పాల్గొనబోతున్నారని సమాచారం.