Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఎజెండా మార్చిన బీజేపీ: అభివృద్ది మంత్రంతో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ఆ మాట లేకుండానే..

తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చాలా భిన్నంగా సాగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

PM Modi Speech in Parade grounds Completely Focus on telangana development not even say Jai sriram slogan
Author
First Published Jul 3, 2022, 10:33 PM IST

తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా తమ ఎజెండాను ఖరారు చేసిందనే చెప్పాలి. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చాలా భిన్నంగా సాగింది. తెలంగాణ అభివృద్ది ఏకైక అంశంగా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశానికి, తెలంగాణకు తాము అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఏం చేశామో చెప్పిన మోదీ.. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణలో అభివృద్ది పరుగులు పెడుతుందని చెప్పారు. 

అదే సమయంలో మోదీ తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై కూడా ఎలాంటి విమర్శలకు చోటు ఇవ్వలేదు. సాధారణంగా సభలలో మోదీ నోటి నుంచి వెలువడే జై శ్రీరామ్ నినాదం కూడా.. ఇక్కడ ఆయన నోటి నుంచి వినిపించలేదు.  తెలంగాణకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడమే కాకుండా.. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ది చేస్తామనే విషయాన్ని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా హిందుత్వ ఎజెండా కాకుండా.. మోదీ ఇక్కడ అభివద్ది మంత్రం జపించారనే మాట వినిపిస్తోంది.

భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తెలుగులో కార్యకర్తలకు నమస్కారం చెప్పారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పోరాట వీరులు, సాహిత్యం.. వంటి అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ‌లోని ఆలయాల గురించి చెప్పిన మోదీ.. ఈ ఆలయాల ఆర్కిటెక్చర్ గర్వం కలిగిస్తుందని చెప్పారు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి వరకు ఇక్కడి పుడమి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. ఇది యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పుణ్యస్థలమని.. ఇది పవిత్ర భూమి అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు యాదాద్రి నరసింహస్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. తెలంగాణ నేలకు వందనం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ విధమైన కామెంట్స్ ద్వారా తెలంగాణపై తమకు ఎంతో మమకారం ఉందనే సంకేతాన్ని పంపారు.

అభివృద్ది మంత్రం జపించిన మోదీ..  
తెలంగాణా అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని మోదీ చెప్పారు. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ది చేస్తామని తెలిపారు.  భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణ ప్రధాన కేంద్రం మోదీ తెలిపారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్లకు పైగా విలువైన 5 భారీ జల ప్రాజెక్టులను చేపడుతుందని చెప్పారు. భాగ్యనగరంలో అనేక పై వంతెన(ఫ్లైఓవర్లు)లు నిర్మించామని.. ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు అయిందన్నారు. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దిలో వేగం పెంచుతామని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చేందుకేనా..?
తెలంగాణ వేదికగా మోదీ చేసిన ప్రసంగం పూర్తిగా భిన్నంగా సాగిందనే మాట వినిపిస్తుంది. టీఆర్ఎస్ పేరు ప్రస్తావించని మోదీ.. ఆ పార్టీ నేతలు కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చేలా పరోక్షంగా తన ప్రసంగాన్ని కొనసాగించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కార్ ఏమి చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్దికి కేసీఆర్‌ కారణమని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్రం అభివృద్దికి నిధులు కూడా ఇవ్వడం లేదని.. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారు. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటే.. మనం జై హనుమాన్ అనాలని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ‌కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈ క్రమంలోనే మోదీ తన ప్రసంగంలో తెలంగాణకు తాము ఏం చేశామో చెప్పడంతో పాటు.. అభివృద్దికి కట్టుబడి ఉన్నామని వివరించారు. భారత్ మాతా కీ జై అని ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. చివరిలో కూడా భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ముగించారు. ఈ మధ్యలో ఎక్కడ మతాల గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ విధంగా మోదీ చాలా వ్యుహాత్మకంగా.. రూట్ మార్చి తెలంగాణ‌ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

కనీసం కేసీఆర్ పేరు కూడా ఎత్తకుండా..
శనివారం యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సభలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ బహిరంగ సభలో తమకు వ్యతిరేకంగా చాలా చెబుతారని అన్నారు. అయితే మిగిలిని బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై విమర్శలు చేసినప్పటికీ.. మోదీ మాత్రం వ్యుహాత్మకంగానే ఎలాంటి విమర్శలు చేయలేదని, కనీసం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదనే టాక్ వినిపిస్తోంది. 


మోదీ ప్రసంగం సాగిందిలా..  
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. మీ ప్రేమకు, ఈ ఆశీర్వాదానికి, తెలంగాణ నేలకు నమస్కరిస్తున్నాను. తెలంగాణ ప్రజలు దేశాభివృద్ధికి చేస్తున్న కృషి, అంకితభావంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కళ, నైపుణ్యం, కృషి తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ప్రతిభావంతుల అంచనాలకు హైదరాబాద్ నగరం కొత్త ఊపునిస్తుంది. అదే విధంగా బీజేపీ కూడా దేశ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తోంది. తెలంగాణా అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి, బీజేపీ మొదటి ప్రాధాన్యతలలో ఒకటి. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని పాటిస్తూ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నాం.

గత 8 సంవత్సరాలలో ప్రతి భారతీయుడి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నించాం. దేశప్రజల జీవితాన్ని ఎలా సులభతరం చేయాలి, అభివృద్ధి ప్రయోజనాలు ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి ఎలా చేరతాయి అనే దాని కోసం మేము నిరంతరం కృషి చేశాం. వెనుకబడిన వర్గాల వారిని, దోపిడీకి గురవుతున్న వారిని.. జాతీయ పథకాల ద్వారా అభివృద్ధిలో భాగస్వాములను చేశాం. పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజనులందరూ.. నేడు తమ అవసరాలు, ఆకాంక్షలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని భావించడానికి ఇదే కారణం.

బీజేపీకి ఆదరణ పెరుగుతుంది..
దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం. ఇప్పుడు వారు దేశాభివృద్ధికి మరింత తోడ్పడగలరు.తెలంగాణలోని పేదలకు ఉచిత రేషన్, పేదలకు ఉచిత వైద్యం, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వ విధానాల ప్రయోజనాలను పొందుతున్నారు. అందుకే నేడు దేశంలోని సామాన్య పౌరుడికి బీజేపీపై అంత నమ్మకం. 2019 ఎన్నికల నాటి నుంచి తెలంగాణలో బీజేపీకి ప్రజాభిమానం క్రమంగా పెరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయాన్ని సాధించిన వేళ దీనికి సంబంధించిన సందర్భంగా ఇది మరోసారి రుజువు అయింది. 

స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా తెలంగాణలోని లక్షలాది మంది పేద తల్లులు, చెల్లెళ్లు, కూతుళ్లు గౌరవప్రదమైన జీవితాన్ని పొందారు. ఉజ్వల పథకం ద్వారా అందించిన ఉచిత గ్యాస్ కనెక్షన్ వల్ల లక్షలాది మంది తెలంగాణా పేద సోదరీమణులు పొగ నుండి విముక్తి పొందారు. మాతృత్వ సమయంలో పౌష్టికాహారం నుంచి టీకాల వరకు తెలంగాణలోని ప్రతి పల్లెకు తీసుకెళ్ళాం. దీని ఫలితంగానే నేడు అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల ఆరోగ్యం కూడా మెరుగవడంతో పాటు వారి జీవితాల్లో సంక్షోభం కూడా తగ్గింది.

ఈ 21వ శతాబ్దంలో దేశంలోని మహిళాశక్తిని దేశశక్తిగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఇటీవలి నివేదిక ప్రకారం.. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా వేగంగా పెరుగుతోంది. గ్రామీణ మహిళల విషయంలో ఈ గణాంకాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. జన్ ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. తెలంగాణలో 1 కోటి కంటే ఎక్కువ జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. వీటిలో 55 శాతానికి పైగా ఖాతాలు మహిళలవే.

భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణ ప్రధాన కేంద్రం. కరోనా కాలంలో వ్యాక్సిన్‌లు, ఇతర పరికరాలకు సంబంధించి ఇక్కడ చేసిన పని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలో చదువులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎప్పుడైతే తెలుగులో సాంకేతికత, వైద్య విద్య అందుబాటులోకి వస్తుందో అప్పుడే తెలంగాణ పల్లెల్లోని పేద కుటుంబాల తల్లుల కలలు సాకారమవుతాయి.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ..
రామగుండం ఎరువుల కర్మాగారం కూడా ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి శక్తినిస్తోంది. దేశంలో గత దశాబ్దాల్లో మూతపడిన అనేక ఎరువుల కర్మాగారాల్లో ఇది కూడా ఒకటి. 2015లో దాదాపు ఆరున్నర వేల కోట్లు పెట్టుబడి పెట్టి.. మళ్లీ అక్కడ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు చేపట్టం. 

రైతులకు ఎంతో చేస్తున్నాం..
తెలంగాణ రైతాంగం సులభతరమైన జీవితం సాగించాలని.. వారు పండించిన పంటకు గరిష్ట ధర లభించాలని మా నిరంతర ప్రయత్నం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నీటికి సంబంధించి రూ.35 వేల కోట్లకు పైగా విలువైన 5 భారీ ప్రాజెక్టులను చేపడుతుంది. అత్యుత్తమ కనెక్టివిటీ తెలంగాణలోని ప్రతి మూలకు చేరాలన్నదే మా ప్రయత్నం. 

రహదారుల అభివృద్ది..
భాగ్యనగరంలో అనేక పై వంతెన(ఫ్లైఓవర్లు)లు నిర్మించాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. తెలంగాణలో గత 8 ఏళ్లలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు అయింది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే..  నేడు అది 5 వేల కిలోమీటర్ల‌కు చేరింది. 2,700 కి.మీలకు పైగా రహదారులను నగరాలను మాత్రమే కాకుండా గ్రామాలను కూడా జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించారు. పీఎం గ్రామీణ సడక్ యోజన మూడో దశ కింద దాదాపు రెండున్నర వేల కిలోమీటర్ల కొత్త రోడ్ల కోసం రూ.1,700 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటైతే..
తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటైతే.. రాష్ట్రంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామం అభివృద్ధికి వేగంగా పనులు జరుగుతాయి. అభివృద్ధితో అందరినీ అనుసంధానం చేయాలి. తెలంగాణ అభివృద్ధిలో వేగం పెంచాలి.

Follow Us:
Download App:
  • android
  • ios