న్యూడిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరు తెలుగులోనే తెలుగు ప్రజలందరికి(తెలంగాణ, ఏపి) శుభాకాంక్షలు తెలిజేశారు. 

''తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మరో ట్వీట్ చేశారు. ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.  కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

readmore కేసీఆర్ తెలంగాణ ఆస్తి, ధైర్యం, దైవం...: ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి గంగుల
 
ఇక రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ''తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అంటూ  ట్వీట్ చేశారు.