ముగిసిన ప్రధాని హైదరాబాద్ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న 51వ డీజీపీల సదస్సులో పాల్గొన్న మోదీ…ఢిల్లీ కు బయలు దేరి వెళ్లారు.
మోదీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం దంపతులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం మోదీ హైదరాబాద్ వచ్చారు. రాత్రి అకాడమీలోని రాజస్థాన్ భవన్ లో బసచేశారు. ఇవాళ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఐపీఎస్ లతో కలిసి యోగా చేశారు. తర్వాత పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు.
మూడు రోజులు జరిగే ఈ సదస్సులో 29 రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఇంటిలిజెన్స్ అధికారులతో పాటు 90 మందికి పైగా ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
48 ఏళ్ల పాటు వరుసగా ఢిల్లీలో జరిగిన డీజీపీల సదస్సు…మోడీ ప్రధాని అయ్యాక…ప్రతి ఏటా అన్ని రాష్ట్రాల్లో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అసోం, గుజరాత్ రాష్ట్రాల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ లో సదస్సు జరుగుతోంది.
