ప్రధాని మోదీ.. ఆదివారం తన తాజా 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం (జూన్ 26) రోజున ప్రధాని మోదీ.. తన తాజా 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’’ను పూర్తి చేసినందుకు పూర్ణను అభినందించారు. ‘‘7 సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా పూర్ణ తన విజయాల టోపీలో మరో రెక్కను చేర్చుకుంది. సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ అనేది.. ఏడు అత్యంత కష్టతరమైన, ఎత్తైన పర్వత శిఖరాలను అధిగమించడమే సవాలు. పూర్ణ తన అలుపెరగని స్ఫూర్తితో ఉత్తర అమెరికా దెనాలి పర్వతంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అదే భారతదేశపు కుమార్తె పూర్ణ.. కేవలం 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి అద్భుత విజయాన్ని సాధించారు’’అని మోదీ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ.. తన 13 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే యంగెస్ట్ గర్ల్‌గా పూర్ణ నిలిచారు. ప్రస్తుతం పూర్ణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది.
ఇక, ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించడం ద్వారా Seven Summits Challengeను పూర్తి చేశారు. పూర్ణ .. మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్ (యూరోప్), మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా), మౌంట్ కార్స్టెన్స్ పిరమిడ్ (ఓషియానియా), మౌంట్ విన్సన్ (అంటార్కిటికా), మౌంట్ డెనాలి యాత్రలను పూర్తి చేశారు.
