ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలు.. ఈ ఐడియా బాగుంది.. హైదరాబాద్‌లోనూ చేద్దాం: కేటీఆర్
ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలను చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముంబయిలోని ఓ ఫ్లై ఓవర్ కింద కొందరు యువకులు ఆ క్రీడా వేదికలో ఆడుకుంటున్నారు. ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోనూ ఇలాంటివి చేయాలని పేర్కొన్నారు.

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేసిన వీడియో చాలా మందిలో కొత్త ఆలోచనలను రేపుతున్నది. నవీ ముంబయిలోని ఓ ఫ్లై ఓవర్ కింద ఉన్న అతను.. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వేదికలను, అందులో ఆడుతున్న ప్లేయర్లను వీడియోలో చూపించాడు. ఫ్లై ఓవర్ల కింద క్రికెట్ ఆడుతున్న దృష్యాన్ని వీడియోలో చూపించాడు. బాస్కెట్ బాల్ కోర్టు, మరికొన్ని కోర్టులు అక్కడ కనిపించాయి. ఫ్లై ఓవర్ పై నుంచి వాహనాలు వెళ్లుతుండగా కింద యువకులు ఆటలో మునిగిపోయి ఉన్నారు. ఈ ఆలోచన బాగుందని, మీ నగరాల్లోనూ ఇలాంటివి ఉన్నాయా? అని ఆ నెటిజన్ పేర్కొంటూ వీడియో ముగించాడు. నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించి ఫ్లై ఓవర్ కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసింది. బంతి బయటకు వెళ్లకుండా చుట్టూ నెట్ కట్టింది. ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఈ ఆలోచన బాగున్నదని, నైస్ ఐడియా అంటూ ఆయన ట్వీట్‌ను పేర్కొన్నాడు. అంతేకాదు, హైదరాబాద్‌లోని కొన్ని చోట్లా ఇలా ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలను ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశాడు.
పై విధానాన్ని పరిశీలించి హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ట్యాగ్ చేశారు.