Asianet News TeluguAsianet News Telugu

పార్టీ మార్పుపై స్పష్టత: 2019లో ఖైరతాబాద్ నుండే పోటీ, దానం గురించి తెలియదు: పి.విజయారెడ్డి

పార్టీ మార్పుపై విజయారెడ్డి స్పష్టత

PJR daughter P. Vijaya Reddy on Danam's entry into TRS


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరనున్నారు.  2019 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దానం నాగేందర్  టిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.  అయితే దానం నాగేందర్  టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఖైరతాబాద్ నుండి బరిలోకి దిగితే  మాజీ మంత్రి  పి. జనార్ధన్ రెడ్డి కూతురు  పి. విజయారెడ్డి  భవితవ్యం ఏమిటనే చర్చ కూడ సర్వత్రా నెలకొంది.

గత ఎన్నికల్లో విజయారెడ్డి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత ఆమె వైసీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. గ్రేటర్ మున్సిఫల్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆమె కార్పోరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే  మాజీ మంత్రి దానం నాగేందర్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

అయితే దానం నాగేందర్ టిఆర్ఎస్‌లో చేరడం విజయారెడ్డికి రాజకీయంగా ఇబ్బందిని కల్గిస్తోందా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ తరుణంలో విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే చర్చ కూడ ప్రారంభమైంది. అయితే ఈ ప్రచారాన్ని విజయారెడ్డి కొట్టిపారేశారు. తాను టిఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.

పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకొంటానని  విజయవారెడ్డి చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ, పార్టీ  ఆదేశాల మేరకు గ్రేటర్ ఎన్నికల్లో  కార్పోరేటర్‌గా పోటీ చేసినట్టు ఆమె  ప్రస్తావిస్తున్నారు.

ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ అధినేత కెసిఆర్‌కు తెలుసునని విజయారెడ్డి అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం  తాను అహార్నిశలు కృషి చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే పి. జనార్ధన్‌రెడ్డి అనే చెరగని ముద్ర ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో  పిజెఆర్ ఆశయాల సాధన కోసం తాము పనిచేస్తున్నామని విజయా రెడ్డి చెప్పారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గం అంటే కుటుంబంగా  భావించినట్టు ఆమె చెప్పారు.  పార్టీ అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకొంటానని ఆమె చెప్పారు.  తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తేలేదని ఆమె చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  తాను పోటీ చేస్తానని  ఆమె చెబుతున్నారు.  తనకు న్యాయం పార్టీ నాయకత్వం న్యాయం చేస్తోందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దానం నాగేందర్ రెడ్డి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే  పార్టీలో కార్యకర్తగా పనిచేసేందుకే టిఆర్ఎస్‌లో చేరుతున్నట్టు దానం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.దానం నాగేందర్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయం తెలియదన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios