హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగాయి. వచ్చే పెట్రోల్ ధర లీటరుకు 86 రూపాయల వరకు వెళ్లవచ్చునని అంచనా వేస్తున్నారు. 

హైదరాబాదులో ఆదివారం లీటరుకు పెట్రోల్ ధర రూ.80.66 ఉండగా, డీజిల్ ధర 73.36 ఉంది. సోమవారం లీటరుకు పెట్రోల్ ధర రూ.81.01కి పెరగగా, డీజిల్ ధర రూ.73.63కు పెరిగింది. 

లీటర్ పెట్రల్ ధర 35 పైసలు పెరగగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగింది. మే 14వ తేదీ నుంచి వరసగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగుతూ వచ్చాయి.

కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు వాటి ధరలు పెరగలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత 14వ తేదీ నుంచి ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్నాయి. 

హైదరాబాదులో డీజిల్ ధర ఆల్ టైమ్ హైకి చేరుకోగా, పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైకి 46 పైసలు తక్కువగా ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 మే 24వ తేదీ పెట్రోల్ ధర లీటరుకు రూ.81.44తో ఆల్ టైమ్ హైగా నమోదైంది. 

హైదరాబాదులో ఈ నెల 14వ తేదీ నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.1.53 పెరగగా, డీజిల్ ధర రూ.1.56 పెరిగింది.  వచ్చే రెండు వారాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.85 నుంచి రూ.87 కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.