హైదరాబాద్: వామన్ రావు దంపతుల కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతూ  శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇప్పటికే ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నిర్వహిస్తోంది.ఈ కేసును సుమోటోగా తీసుకొంది హైకోర్టు.అయితే ఈ కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే వామన్ రావు హత్య కేసు విషయమై  తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. ఈ కేసు విషయమై ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు పిటిషనర్ కు సూచించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 17వ  తేదీన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రోడ్డుపైన వామన్ రావు దంపతులను దుండగులు నరికి చంపారు.

వామన్ రావు దంపతుల హత్య కేసు విషయమై  అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.  ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. ఈ హత్యతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమ పార్టీ నేతను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టుగా ఆయన స్పష్టం చేశారు.