తెలంగాణ యువనేత రాష్ట్ర మంత్రి కేటిఆర్ అద్భుతమైన విషయాన్ని ట్విట్ చేసి జనాలకు చెప్పిండు. అందులో పేర్కొన్న విషయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. అంత గొప్ప విషయాన్ని కేటిఆర్ ట్విట్ చేశారు. కేటిఆర్ ట్విట్ అంటే మామూలు విషయం కాదుగదా? దానికి ట్విట్టర్ లో లైకుల, షేర్లు రీ ట్విట్లు జోరుగా వచ్చినయ్. ఈ వార్త రాస్తున్న సమయంలో కేటిఆర్ ట్విట్ కు 112 కామెంట్లు, 181 రీట్విట్లు, 1100 కు పైగా లైకులు వచ్చాయి. మరి కేటిఆర్ చెప్పిన అంత అద్భుతమైన ముచ్చటేంది? మరి అసలైన ఇంకో ముచ్చటేంది అన్న సందేహలు తీరాలంటే ఈ కథనాన్ని ఇలాగే చదువతూ కదలండి.

కేటిఆర్ వర్షన్ లో... అది హైదరాబాద్ శివారు పరిసరాల్లోని కొండాపూర్ ప్రాంతం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం.. సరిగ్గా చెప్పాలంటే 2011 ఏడాది. అప్పటి గూగుల్ పొటో చూస్తే కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ బోసిపోయి కనబడుతున్నది. నేలంతా ఎర్ర రంగులో నిస్తేజంగా కనబడుతున్నది. ఆ సయమంలో అప్పడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ప్రయివేటు వాళ్లకు అప్పగించి నాశనం చేయాలనుకుంది. దీని తాలూకు సాక్ష్యంగా 2011లో గూగల్ తల్లి తీసిన ఒక ఫొటోను కేటిఆర్ ట్విట్ చేశారు.

ఇక వర్తమానంలోని అంశాలను సైతం కేటిఆర్ ప్రస్తావించారు. నవంబరు 2016 నాటి గూగుల్ తల్లి తీసిన చిత్రాన్ని ట్విట్ లో ఉంచారు. అప్పట కాంగ్రెస్ హయాంలో ఉన్న చిత్రానికి ఈ చిత్రానికి చాలా తేడా ఉంది. ఈ చిత్రంలో గ్రీనరీ కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. నాడు నిస్తేజంగా ఉన్న భూమి నేడు పచ్చ రంగు పూసినట్లు కనబడుతున్నది. ఇదే విషయాన్ని కేటిఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. నాటి కాంగ్రెస్ పాలనకు తమ పానలకు తేడాను వివరించారు. 270 ఎకరాల స్థలాన్ని తమ ప్రభుత్వం లంగ్ స్పేస్ గా డెవలప్ చేసిందన్నారు.

ఇక ఇంకో ముచ్చటకు వద్దాం... కొండాపూర్ లోని 270 ఎకరాల బొటానికల్ గార్డెన్ లంగ్ స్పేస్ గా కాపాడిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందించాల్సిందే. అదే సమయంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ ప్రేమికులు, క్రీడాకారులు దాదాపు అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్న బైసన్ పోలో గ్రౌండ్ విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే బాగుంటుందంటున్నారు. ఎందుకంటే బైసన్ పోలో గ్రౌండ్ కూడా లంగ్ స్పేస్ గానే ఉంది. ఈ ప్రాంతంలో సచివాలయ నిర్మాణానికి తెలంగాణ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ఊరి బయట 270 ఎకరాల స్థలాన్ని గ్రీనరీగా మార్చిన తెలంగాణ సర్కారు ఊరి మధ్యలో ఉన్న గ్రీనరీని చెడగొట్టి కాంక్రిట్ జంగల్ గా మార్చే ప్రయత్నం చేయొద్దని చెబుతున్నారు.

ఈ చిన్న కోరిక మీద ఒక ఉద్యమం మొదలయింది. బైసన్ పోలో గ్రౌండ్ లంగ్ స్పేస్ అభిమానులు సేవ్ బైసన్ పోలో గ్రౌండ్ (ఎస్ బి పి జి) గ్రూప్ గా ఏర్పడ్డాయి. ఇప్పుడున్న ఎపి, తెలంగాణ సచివాలయ భవనాలను వాడుకుంటూ బైసన్ పోలో గ్రౌండ్ ను దయచేసి వదిలేయాలని వారు కోరుతున్నారు. అపుడు కెటిఆర్ నిజంగా ఎన్విరాన్  మెంట్ ల్ హీరో అయిపోతారు.

మరి ఈ విషయాన్ని కేటిఆర్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది.