హైదరాబాద్ నగరాన్ని గత నాలుగురోజులుగా వర్షం ముంచెత్తుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తి జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అది రోడ్డా  లేదా చెరువా అనే అనుమానం కూడా కలుగుతోంది. ప్రజలు కనీసం ఇంటి నుంచి బయటకు రావాలన్నా కూడా ఇబ్బందిపడిపోతున్నారు. కనీస అవసరాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు. కాగా... కొందరు నెటిజన్లు మాత్రం తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్నారు.

మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో నెటిజన్ల ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా సైనికపురి ప్రాంత నెటిజన్లు విపరీతంగా కేటీఆర్ కి ట్వీట్లు చేస్తున్నారు.  తమ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయని.. దీంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువస్తున్నారు. 

సైనికుపురిలోకి కాప్రా సరస్సులో మురికి నీరు చేరుతోందని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఓ నెటిజన్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా... ఈ ట్వీట్ కి అధికారులు కూడా వెంటనే స్పందించారు. అయితే... ఈ సమస్య ఇప్పటిది కాదని... ఎప్పటి నుంచో ఉందని కొందరు స్థానికులు చెప్పడం గమనార్హం. తాను ఈ సమస్య పరిష్కారం కోసం గత ఏడు సంవత్సరాలుగా పోరాడుతున్నానంటూ ఆ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ లెఫ్ట్ నెంట్ కల్నల్ కామేష్ అన్నారు. ఈ సమస్య ఇప్పటిది కాదని ఎప్పటి నుండో ఉందని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కాప్రా డిప్యుటీ కమిషనర్ దశరథ్ ట్విట్టర్ లో స్పందించారు. సమస్య తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దానిని పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.