హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి వర్షం దంచికొట్టింది. వికారాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అక్కడ 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి వర్షం దంచికొట్టింది. వికారాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అక్కడ 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల దాదాపు నిండిపోవడంతో.. తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. వికారాబాద్‌లో దన్నారం వాగు, కాగ్న నది‌ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తాండూరు- వికారాబాద్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పరిగి-వికారాబాద్‌ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇక, మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తాండూరు- రాస్నం గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. యాలాల్ మీదుగా తాండూరుకు వాహనాలను మళ్లిస్తున్నారు. తాండూరు పాత కాగ్న నది బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు వికారాబాద్, శంకర్ పల్లిలో భారీ వర్షం కురవడంతో.. గండిపేట జలశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

మరోవైపు వికారాబాద్‌ జిల్లాలో పుడూరు మండలంలోని పుడుగుర్తిలో కంకల్ వాగు పొంగిపోర్లుతుంది. దీంతో పుడుగుర్తి నుంచి కంకల్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో రాత్రి 12 గంటలు దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోటి, అబిడ్స్, మలక్పేట్, దిల్ షుక్ నగర్, ముషీరాబాద్, కాప్రా, హెచ్ బికాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, కాజాగూడ, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్ నగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, తదితర ప్రాంతాలు మోకాలు లోతు నీరు నిలిచింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా నీరు నిలిచింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.