బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, అవినీతితో ప్ర‌జ‌లు విసిగిపోయారు.. : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలు, అవినీతితో విసిగి వేసారిన ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేస్తారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తార‌నీ, ఆ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని స్ప‌ష్టం చేశారు.
 

People are fed up with the failures and corruption of the BRS : Congress Ponguleti Srinivasa Reddy

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అలాంటి ప్రేమ, ఆప్యాయతలు పొందడం తన ఆశీర్వాదమని అన్నారు. పాలేరు ఎన్నికల్లో సులువుగా గెలిచి భారీ మెజారిటీ వచ్చేలా చూస్తామన్నారు.

శుక్రవారం ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్న ఆయన.. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. కూసుమంచి మండలంలోని మునిగేపల్లి, అగ్రహారం, నేలపట్ల, వెంకటాపురం, కోక్యతండా, లోక్యతండా, తురకగూడెం, కిష్టాపురం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రతిచోటా ఆయనకు అట్టహాసంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలు, అవినీతితో విసిగి వేసారిన ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేస్తారని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బు బలంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకుడు కందాళ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఆయన సమక్షంలో గులాబీ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కాగా, పాలేరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,34,449. వీరిలో 1,21,074 మంది మహిళలు, 1,13,370 మంది పురుషులు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. నియోజకవర్గం 4 మండలాల్లో విస్తరించి ఉంది. అవి కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెంలు ఉన్నాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీకి న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios