Asianet News TeluguAsianet News Telugu

భావోద్వేగంతో ఈటలను గెలిపించినా లాభం వుండదు... ఆలోచించండి: హుజురాబాద్ ఓటర్లతో పెద్దిరెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

Peddireddy Shocking Comments Over Eatala Rajender akp
Author
Huzurabad, First Published Jul 29, 2021, 6:13 PM IST

కరీంనగర్: ఇటీవలే బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈనుగాల పెద్ది రెడ్డి రేపు(శుక్రవారం) టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఅర్ సమక్షంలో వేల మంది కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు.  

''తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పార్టీలో చేరుతున్నాను. నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రజలే. వారి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా'' అని తెలిపారు. 

''హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అవేశపడకుండా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వ్యక్తులు చేసిన తప్పులకు, వాళ్ల వ్యక్తిగత భావోద్వేగాలకు మనం బలిపశువులం కావాల్సిన అవసరం లేదు. ఇవి ప్రజలు కోరుకున్న ఎన్నికలు కావు... అయినా అనివార్యమైన ఎన్నికలు. నా ఆత్మగౌరవాన్ని మీ ఆత్మగౌరవంగా తీసుకోండి అనే నినాదమే కనబడుతుంది కానీ ప్రజల కోణంలో తీసుకున్న నిర్ణయంలాగా కనబడుట లేదు'' అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు పెద్దిరెడ్డి. 

read more హుజురాబాద్: వాట్సాప్‌ చాట్ వ్యవహారంలో ట్విస్ట్.. ఈటల పాదాలకు దళితుల పాలాభిషేకం, వీడియో వైరల్

''ప్రభుత్వంలో ఉండి కొన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి ఇంకా అదే పార్టీలో ఉంటే అభివృద్ది జరిగేది. ఇంకా రెండు సంవత్సరాలు అవకాశం వున్నా ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రి పదవి నుండి తొలగించినా ఎంఎల్ఏ గా కొనసాగిండు. ఇవన్నీ ఈటల రాజేందర్ మీద కోపంతో కాదు రాజకీయ అనుభవంతో చెప్తున్నా'' అన్నారు. 

''హుజూరాబాద్ ను జిల్లా చేయడం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అయ్యేది. కానీ ఈటల ఆ దిశగా ప్రయత్నించలేదు. ఆవేశంతో చిన్న పిల్లాడి మాదిరిగా రాజీనామ చేశారు... దీంతో ప్రజలే నష్టపోతున్నారు. ఈ ఒక్క సీట్ తో ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు కానీ నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు. దళిత బందు కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం అదృష్టం'' అని పేర్కొన్నారు. 

''హుజూరాబాద్ ను అభివృద్ది పథంలో నడవాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ప్రభుత్వానికి అనుకూలమైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ది చేసుకోవచ్చు. ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి ఈటల గెలిచినా లాభం ఉండదు.  టీఆరెఎస్ పార్టీ నీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన గెలుపు కోసం కృషి చేస్తా'' అని పెద్దిరెడ్డి అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios