బంగారు నగలపై కన్ను.. పొరుగింటి దంపతుల దారుణం, వృద్ధురాలి హత్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి ఇంటికి సమీపంలో ఉన్న జక్కుల రవి అతని భార్య లక్ష్మి బంగారం కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ మంగళవారం మీడియాకు తెలిపారు. అడ్డగుంటపల్లిలో ఈ నెల 5న పట్టపగలు బొమ్మకంటి విజయ అనే వృద్ధురాలు హత్య జరిగింది. ఈ సంఘటనలో ఇంటికి సమీపంలో ఉన్న భార్య భర్తలే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి లక్షా యాభైవేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు.
వృద్ధురాలి ఇంటికి సమీపంలో ఉన్న జక్కుల రవి అతని భార్య లక్ష్మి బంగారం కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడకు టవల్ తో బిగించి హతమార్చారని డీసీపీ పేర్కొన్నారు. వెంటనే ఒంటిపై ఉన్న బంగారు నగలు అపహరించుకు పోయినట్లు ఆయన తెలిపారు. మృతురాలి కుమారుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని డీసీపీ రవీందర్, ఏసిపి ఉమేందర్ పరిశీలించారు. వన్ టౌన్ సీఐ లు గంగాధర రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ సంఘటనపై అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడు జక్కుల రవి గతంలో పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడని రవీందర్ పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించడంలో సహకరించిన సిఐలు, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.