పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో మాస్క్ లేకుండా తిరుగుతున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని రేపు మంథని కోర్టులో హాజరు పరచనున్నారు. ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోనందుకు కేసు నమోదు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. 

మరోవైపు కేసుల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝళిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనిలో భాగంగా హైద‌రాబాద్‌లో ముఖానికి మాస్క్‌ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిపై భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధిస్తున్నారు.

హైదరాబాద్‌లోని కోఠీ, ఇందర్‌బాగ్, గుజరాతీ గల్లీలలో సుల్తాన్ బజార్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్క్‌లు ధరించని షాప్ యజమానులు, పాదచారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మాస్క్ వేసుకొని వారి వివరాలు, ఫోటోలు సేకరించి మేజిస్ట్రేట్‌కు పంపుతున్నారు. మరోసారి మాస్క్‌లు వేసుకోకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.