పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జడ్పిటిసి గంట రాములు వర్గీయులు భట్టి విక్రమార్క ముందే బాహాబాహీకి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

పెద్దపల్లి : స్వాతంత్రోద్యమ కాలంలో ఆవిర్భవించిన పార్టీ... దేశాన్ని దశాబ్దాలు పాలించిన పార్టీ...ఎందరో గొప్ప నాయకులను దేశానికి అందించిన పార్టీ కాంగ్రెస్. ఇలా ఘన చరిత్ర కలిగి పార్టీ ప్రస్తుతం అటు దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులంతా కలిసికట్టుగా వుంటూ పార్టీని బ్రతికించుకోవాలి. కానీ వ్యక్తిగత స్వేచ్చ ఎక్కువగా వుండే ఆ పార్టీ నాయకుల మధ్య ఎప్పుడూ పంచాయితే. ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయిలోని కీలక నాయకుల నుండి కిందిస్థాయి నాయకుల మధ్య నిత్యం అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుంటాయి. ఇలా తాజాగా పెద్దపల్లి జిల్లాలో స్వయంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సాక్షిగా కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంది. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసేందుకు జోరుగా పాదయాత్రలు సాగుతున్నాయి. ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ మొదటివిడత పాదయాత్ర చేపట్టగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఆదిపత్య పోరు ఏ స్థాయిలో వుందో భట్టి పాదయాత్రలో భయటపడింది.

Read More జోగులాంబ ఆలయం నుండే రెండో ఫేజ్ :మే 9 నుండి రేవంత్ పాదయాత్ర

మంగళవారం సాయంత్ర భట్టి విక్రమార్క పాదయాత్ర పెద్దపల్లి జిల్లా బొంపల్లికి చేరుకుంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జడ్పిటిసి గంట రాములు వర్గీయులు భట్టికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల నాయకుల మధ్య మాటామాటా పెరిగి రోడ్డుపై తన్నుకున్నారు.

వీడియో

భట్టి విక్రమార్క సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా మాజీ ఎమ్మెల్యే, జడ్పిటిసి వర్గీయులు గొడవపడ్డారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ కర్రలతో పరస్పర దాడులకు దిగారు. ఈ గొడవలో రాములు వర్గానికి చెందిన రజనీకాంత్ తల పగిలి తీవ్ర గాయమైంది. ఇలా భట్టి విక్రమార్క ముందే పెద్దపల్లి కాంగ్రెస్ లో విబేధాలు భయటపడ్డాయి. 

తమపై దాడి చేయించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గంట రాములు వర్గీయులు నిరసనకు దిగారు. జడ్పిటిసి వర్గీయులకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వర్గం కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.