కలెక్టర్ అనగానే దేశంలోనే గొప్పవాళ్లు అన్న భావన జనాల్లో ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ చదువు అందరూ చదవలేరు. లక్షల్లో ఒకరే చదవలగరు. అంతటి గొప్ప స్థానంలో ఉన్నవారు సహజంగానే మేము గొప్పవాళ్లం అన్న భావనతో ఉంటారు. కొందరైతే మిగతావాళ్లంతా మాకంటే తక్కువ వాళ్లు అన్నట్లు చూస్తుంటారు. కానీ ఇటీవల పెద్దపల్లి కలెక్టర్ గా బదిలీపై వెళ్లిన శ్రీదేవసేన చేసిన పని సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. కలెక్టర్ల చరిత్రలో ఎవరూ చేయని పని చేసి అందరి మన్ననలు అందుకున్నారు దేవసేన. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..?

మావోయిస్టు అగ్ర నేతల జాబితాలో మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు పేర్లు ప్రముఖంగా మనం వినే ఉన్నాం. అయితే వారిద్దరి కన్నతల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన పాదాభివందనం చేశారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఈ సంఘటన చోటు చేసుకుంది. గణతంత్ర వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మధురమ్మ భర్త వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. అయితే ఆయన మరణించారు కాబట్టి ఆయన సతీమణి మధురమ్మకు సన్మానం చేసేందుకు ఆహ్వానించారు. కలెక్టర్ చేతులు మీదుగా ఆమెకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు శాలువా కప్పడంతోపాటు ఏకంగా పాదాభివందనం చేశారు.

మధురమ్మ ఇద్దరు కుమారులు మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు ఇద్దరు కూడా మావోయిస్టు అగ్రనేతలే. కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీ గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, వేణుగోపాల్‌రావు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. అయితే వేణుగోపాల్ రావు ను జన జీవన శ్రవంతిలో కలవాలని, మీరూ ఆ ప్రయత్నం చేయాలంటూ కలెక్టరమ్మ మధురమ్మ కాళ్లు మొక్కి వేడుకున్నట్లు చెబుతున్నరు.

కలెక్టరమ్మ చేసిన ఈ పనిని అక్కడున్నవారంతా అభినందించారు. ఆమెను మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఏ కలెక్టర్ కూడా ఇలాంటి గొప్ప పని చేయలేదని జనాలు చర్చించుకున్నారు. ఇటీవల కాలంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమాలపై ఉక్కుపాదం మోపి రికార్డు సృష్టించారు కలెక్టర్ దేవసేన. ముత్తిరెడ్డి అక్రమాలను బట్టబయలు చేయడంతో ఆమెపై అనూహ్యంగా బదిలీ వేటు పడింది. దీంతో తాను ఎక్కడున్నా జనాల కోసమే పనిచేస్తానని పెద్దపల్లిలో నిరూపించారు శ్రీదేవసేన. అందుకే ఆమెకు అందూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.